రుద్రవరం మండలంలోని రెడ్డిపల్లె గ్రామంలో నీటి తొట్టిలో పడి ఏడాది చిన్నారి మృతి చెందిన సంఘటన పలువురిని కన్నీరు తెప్పించింది. బుడిబుడి నడకలతో అల్లారుముద్దుగా పెరిగిన చిన్నారి ఇంటిల్లిపాది కాకుండా గ్రామంలోని చుట్టుపక్కల వారు సైతం నివ్వెర పోయే విధంగా చిలిపి చేష్టలతో అందర్నీ ఆకట్టుకునే చిన్నారి కడుపుబ్బ నవ్విస్తూ అందరి దీవెనలు పొందిన చిన్నారికి నీటితోట్టి రూపంలో మృత్యువు కబలించింది. నిండు నూరేళ్లు జీవించాల్సిన చిన్నారి నిండు జీవితం తెల్లారిపోయింది. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిన్న రాయుడు, నీరజ దంపతులకు ఇద్దరు కుమారులు వీరిలో చిన్న కుమారుడు సూర్య(1) కు ఏడాది వయస్సు . తల్లిదండ్రులు ఇంటిదగ్గర పనులు చేసుకుంటూ ఉండగా చిన్నారి సూర్య ఆడుకుంటూ నీటి తొట్టి లో పడి ఊపిరి ఆడక మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు దుఃఖంతో విలపించారు. చిన్నారి మృతి చెందడంతోగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. చిన్నారి మృతి చూపరులను కండతడి పెట్టించింది.