శ్రీసిటీ, మే 20 (తేజ న్యూస్ టీవీ )
శ్రీసిటీ లోని కొబెల్కో ఇండియా సంస్థ, సోమవారం తమ పరిశ్రమ ఉత్పత్తులైన భారీ ఎక్స్‌కవేటర్‌లను (మట్టి తవ్వే యంత్రం) తడ రైల్వే స్టేషన్ నుండి రైలులో రాజస్థాన్‌లోని జైపూర్‌కు రవాణా చేసింది. ఇది తడ రైల్వే స్టేషన్ నుండి “మేడ్ @ శ్రీ సిటీ” పారిశ్రామిక ఉత్పత్తుల మొట్టమొదటి ప్రత్యక్ష రైలు రవాణా కావడం విశేషం. తమ మొదటి రవాణాలో 35 ఎక్స్‌కవేటర్‌లను కొబెల్కో సంస్థ తరలించింది.
ఉత్తర భారతదేశానికి రైలు రవాణా దిశగా పెరుగుతున్న డిమాండు దృష్ట్యా తమ భారీ వాహనాల రవాణాకు ఈ సదుపాయాన్ని ఎంచుకున్నట్లు కొబెల్కో ప్రతినిధి పేర్కొన్నారు. దీంతో పాటు, ఈ రైలు రవాణా ద్వారా 20 శాతం వరకు ఖర్చు ఆదా అవుతుందన్నారు. ఇంకా, ట్రక్కుల ద్వారా చేసే రోడ్డు రవాణాతో పోలిస్తే ఈ పద్దతి కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పారు.తడ రైలు రవాణా సేవలపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు. ఈ రవాణా కోసం తడ స్టేషన్‌లో మెరుగైన కార్గో హ్యాండ్లింగ్ సౌకర్యాలు, కంటైనర్ జోన్, మెరుగైన మౌళిక సదుపాయాలను రైల్వే శాఖ కల్పించాలని ఆయన చెప్పారు. ఇది వ్యాపార అవసరాలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా, రైల్వే శాఖకు గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చుతుందని అన్నారు. తక్కువ ఖర్చుతో తమ ఉత్పత్తులను రవాణా చేయడానికి శ్రీసిటీ మరియు పరిసర ప్రాంతాల పరిశ్రమలకు ఇది అత్యంత ప్రయోజనకరమైన సదుపాయంగా ఆయన వ్యాఖ్యానించారు.తడ రైల్వే స్టేషన్ నుండి రవాణా సదుపాయం పట్ల శ్రీసిటీ పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత సమీపంలో తడ స్టేషన్ ఉండడం వలన రవాణా ఖర్చు, సమయం వీరికి ఆదా అవుతాయి. పలు ప్రధాన భారతీయ నగరాలు, ఓడరేవులకు ఈ స్టేషన్ అనుసంధానం కావడంతో శ్రీసిటీ పరిశ్రమల మార్కెట్ పరిధి మరింత విస్తరించనుంది.
తడ రైల్వే స్టేషన్ నుండి కొబెల్కో క్రేన్ల రవాణా
RELATED ARTICLES