TEJA NEWS TV :
రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్: ఆళ్లగడ్డ
ఆళ్లగడ్డ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం… ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరుపుకునేందుకు కౌన్సిల్ హాల్ సరిగ్గా లేదని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి నిధులను మంజూరు చేయించి కౌన్సిల్ హాల్ కు నూతన భవనాన్ని నిర్మిస్తామని ఆమె హామీ ఇచ్చారు. కౌన్సిలర్లు అధికారులు సిబ్బంది కలసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే అఖిలప్రియ పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ఆళ్లగడ్డను అభివృద్ధి చేస్తామని తెలిపారు. తనకు ఓటు వేసిన వారికి… ఓటు వేయని వారికి కూడా తాను ఎమ్మెల్యే నే నని స్పష్టం చేశారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి వైపే దృష్టి సారిస్తామని రానున్న ఐదు సంవత్సరాల పాటు తనకు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా వారి కష్టసుఖాలలో ఎల్లప్పుడూ పాలుపంచుకుంటామని తెలియజేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం లో అభివృద్ధి కోసం అన్ని శాఖల మంత్రులను అసెంబ్లీలో కలిసి నిధులను మంజూరు చేయిస్తామని తెలిపారు.
ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదు…
అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వారు ఏదైనా పనుల కోసం వచ్చినప్పుడు సహకరించాలని ఎమ్మెల్యే అఖిలప్రియ సూచించారు. ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం తాను ఊరుకునేది లేదని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు పనిచేయాలని అఖిలప్రియ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి, వైస్ చైర్మన్ నాయాభ్రసూల్, మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.