
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
అశ్వరావుపేట నవంబర్ 7:
అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపిస్తూ BRS పార్టీ నేతలు ఈరోజు అశ్వారావుపేట MLA క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. మాజీ MLA, BRS నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నాయకత్వంలో ఐదు మండలాల BRS నాయకులు ఈ ముట్టడిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మెచ్చా నాగేశ్వరరావు, “అశ్వారావుపేట నియోజకవర్గంలోని రహదారులు నరకానికి మార్గాలుగా మారాయి. ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదు. DMFT, CSR నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు,” అని మండిపడ్డారు.
“గత BRS ప్రభుత్వంలో నిర్మించిన రోడ్లే ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. కొత్త రోడ్లు వేయకపోగా, గుంతలు పడ్డ రోడ్లను సైతం మరమ్మతు చేయడం లేదు. అశ్వారావుపేట పట్టణంలో 23 కోట్లతో సెంట్రల్ లైటింగ్ మంజూరు చేసినా, రెండేళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదు. వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,” అని ఆయన అన్నారు.
గిరిజన గ్రామాల్లో తాగునీరు, వీధి దీపాలు, చెత్త సేకరణ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నా, ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రజల కోసం ఎవ్వరూ నిలబడడం లేదు,” అని విమర్శించారు.
మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ, “మణుగూరులో పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి హేయమైన చర్య. ఇలాంటి రౌడీ రాజకీయాలు చేయడం తగదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారు,” అన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో BRS పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేసిన ఆయన, “అశ్వారావుపేట నియోజకవర్గానికి రావాల్సిన నిధులు విడుదలయ్యే వరకు, రహదారుల మరమ్మతులు పూర్తయ్యే వరకు ఈ పోరాటం ఆపేది లేదు,” అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



