కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయదశమి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని బురుజు దగ్గర జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏదుల్ల ఇంద్రసేనారెడ్డి హాజరై ప్రసంగించారు. సంఘం దేశ సేవలో చేసిన కృషిని ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తున్నాయని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న గోవర్ధన్ రెడ్డి (శ్రీ పాపయ్య గారి) మాట్లాడుతూ, దేశ సేవలో సంఘ్ పాత్ర విశిష్టమని అన్నారు. అనేక సంస్థలు కాలగమనంలో కనుమరుగైనప్పటికీ, సంఘం మాత్రం దేశ దీర్ఘకాల ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. వేలాది ప్రచారకులు కుటుంబాలను వదిలి భారతమాత సేవలో తమను అంకితం చేసుకుంటున్నారని అన్నారు.
డాక్టర్ హెడ్గేవర్ పాత్రను గుర్తుచేసుకుంటూ, ఆయన దేశ చరిత్రలో మరపురాని స్థానం సంపాదించారని వక్తలు అన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ, పండగలు, సంస్కృతి, భాష, వేషధారణ వంటి భిన్న సంస్కృతులను గౌరవించి, స్వదేశీ ఆచారాలను పాటించడం ద్వారా సమాజంలో మార్పు తేవాలని పిలుపునిచ్చారు. వ్యక్తి, కుటుంబం, సంస్థ కంటే దేశ ప్రయోజనాలే ప్రధానమనే భావనతో సంఘం వందేళ్ల సుదీర్ఘ ప్రయాణం విజయవంతమైందని వివరించారు.
ప్రస్తుతం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణత, పర్యావరణ సమస్యలు, విదేశీ వస్తువుల అధిక వాడకం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తమైందని తెలిపారు. 2025 దసరా నుండి 2026 దసరా వరకు శతాబ్ది ఉత్సవాల భాగంగా ఏడాది పొడవునా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ABVP, స్వదేశీ జాగరణ మంచ్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ తదితర సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.
బిబిపేట్ మండలంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది విజయదశమి ఉత్సవాలు
RELATED ARTICLES



