ఆళ్లగడ్డ: రాష్ట్ర ప్రభుత్వం బిగిస్తున్న స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులపై వేల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పేరిగిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే జోక్యంచేసుకొని స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని రద్దు చేయాలని, వినియోగదారులు, ప్రజలపై భారాలు పడకుండా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి .రామచంద్రుడు, సిపిఎం ఆళ్లగడ్డ ఏరియా సభ్యులు శంకర్ , సుధాకర్ లు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో ఆళ్లగడ్డలోని పలు చిన్న వ్యాపార సంస్థలు, ఫ్లోర్ మిల్లులు, వాటర్ ప్లాంట్, వెల్డింగ్ షాప్ లు, పెట్రోల్ బంక్ మరియు చిన్న చిన్న వ్యాపారస్తులు వద్ద సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సర్వేలో జనవరి నెలలో ప్రభుత్వం బిగించిన స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ బిల్లులు విపరీతంగ పెరిగినట్లు వెల్లడైందన్నారు. బతుకు తెరువు కోసం నలుగురు వ్యక్తులను పెట్టుకొని వెల్డింగ్ షాప్ పని చేస్తుంటే గత రెండు నెలల క్రితం 6000 నుండి 7వేల రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చేదని, ప్రభుత్వ పుణ్యమా అని అంటూ స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల 26వేల రూపాయలు కరెంటు బిల్లులు వచ్చాయని వెల్డింగ్ కార్మికులు తమ ఆవేదనను సిపిఎం నాయకులు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే చిన్నపాటి వాటర్ ప్లాంట్ నడుపుకుంటున్న తమకు రెండు నెలల క్రితం 12 వేల రూపాయలు నుండి 13 వేల వరకు బిల్లులు వచ్చేవని ప్రస్తుతం 32,000 నుండి 34,000 వరకు ఫిబ్రవరి నెల, మార్చి నెల బిల్లులు వచ్చాయన్నారు.. రొట్టె పిండిమిషన్ , చిన్నపాటి ఫ్లోర్ మిల్ లకు గతంలో పదివేల రూపాయలు బిల్లులు వచ్చేవని ప్రస్తుతం 14 వేల నుండి 18 వేల వరకు బిల్లులు వచ్చాయనీ , స్వయం ఉపాధి కోసం చిన్నపాటి ఉపాధి వ్యాపారాలు పెట్టుకుంటే మూడిందల పెరుగుదలతో విద్యుత్ బిల్లులు వస్తున్నాయని అందువల్ల తమ కుటుంబ జీవనోపాధి చాలా కష్టమవుతుందని సిపిఎం నాయకులకు తెలియజేశారు. అలాగే గతంలో 60 నుండి70 వేలరూపాయల వరకు బిల్లులు వచ్చే పెట్రోల్ బంకులకు ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల వల్ల లక్ష రూపాయలు దాటుతున్నవన్నీ తెలియజేశారు. పెరిగిన విద్యుత్ బిల్లులపై సంబంధిత విద్యుత్ అధికారులకు తెలియజేసిన ఏ మాత్రం పట్టించుకోవడం లేదనీ పలువురు తెలియజేశారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వినియోగదారుల వద్దకెళ్లి వారి మీటర్లు పరిశీలించి వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గేలా చేయాలని, బిల్లుల పెరుగుదలకు కారణమైన స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దుచేసి వారికి పాత మీటర్లనే ఇవ్వాలని సిపిఎం నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బిజెపి మోడీ ప్రభుత్వం అనుసరించిన విద్యుత్ విధానాలను గత ప్రభుత్వం మరియు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నదన్నారు. విద్యుత్ ఒప్పందాల వల్లనే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, వాటి వల్ల ప్రజలందరిపై భారాలు పడుతాయని, కేవలం కార్పొరేట్ కంపెనీలకు, అదాని సంస్థలకు మేలు చేసేందుకు ప్రజలపై విద్యుత్ బారాలు మోపుచున్నారని ప్రజలందరూ ఐక్యమై స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడాలనీ ప్రజలను కోరారు.
స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి,విద్యుత్ బిల్లుల పెరుగుదలను అరికట్టాలి..సిపిఎం డిమాండ్
RELATED ARTICLES