శ్రీసిటీ, ఏప్రిల్ 26 ( తేజన్యూస్ టీవీ )
సామాజిక వసతుల కల్పనలో భాగంగా శ్రీసిటీలో నూతనంగా కమ్యూనిటీ గ్రంధాలయం, క్రికెట్ మైదానం లను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం స్థానిక క్రీక్ సైడ్ నివాస సముదాయం సమీపంలోని షాపింగ్ ఆర్కేడ్ రెండవ అంతస్తులో లాంఛనంగా పూజలాచరించి గ్రంధాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్మయా విద్యాలయ ట్రస్టీ ఓవి నంబియార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అలాగే స్థానిక జ్ఞాన్ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన క్రికెట్ మైదానాన్ని శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ ప్రారంభించారు.శ్రీసిటీలో నెలకొల్పబడిన ట్రిపుల్ ఐటీ, క్రియా విశ్వవిద్యాలయం, చిన్మయ విద్యాలయ, అకార్డ్ విద్యా సంస్థల విద్యార్థులతో పాటు పరిశ్రమ వర్గాలు కూడా ఆటవిడుపుగా ఈ క్రికెట్ మైదానాన్ని వినియోగించుకోవచ్చు. గతంలో కూడా క్రీడా వసతుల్లో భాగంగా శ్రీసిటీలోని ఇన్ అతిథిగృహం సమీపంలో గోల్ఫ్ కోర్స్ మైదానాన్ని నెలకొల్పారు.
నూతన వసతుల కల్పనపై స్పందించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీ పరిధిలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, పరిశ్రమల ప్రతినిధులు, ఉద్యోగులు వీటిని వినియోగించుకోవడం ద్వారా నైపుణ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పొందాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని వసతులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
శ్రీసిటీలో కమ్యూనిటీ గ్రంధాలయం,క్రికెట్ మైదానం ప్రారంభం
RELATED ARTICLES