శ్రీసిటీలోని గృహోపకరణాల తయారీ పరిశ్రమ హామిల్టన్ ప్రైవేట్ లిమిటెడ్, తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) లో భాగంగా, శ్రీసిటీ పరిసర ప్రాంతాలలోని దివ్యాంగులకు భారీ సాయం అందించింది. రూ. 15 లక్షల విలువైన వీల్ ఛైర్లు, ట్రై సైకిళ్ళు, వినికిడి యంత్రాలు, ఊత కర్రలు, ఇంకా దివ్యాంగులకు అవసరమైన పలు పరికరాలను పంపిణీ చేసింది. దీని ద్వారా 305 మందికి లబ్ది చేకూరింది. గురువారం కంపెనీ ఆవరణలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో హామిల్టన్ జనరల్ మేనేజర్ జయంత, ఇతర అధికారులు రాజేష్ గాంధీ, ప్రసన్న, డానెలి వాజ్, లారెన్స్, శ్రీసిటీ ప్రతినిధులు రమేష్ కుమార్, వై.రమేష్, సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.శ్రీసిటీ ఫౌండేషన్ సహకారం, సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపిన పరిశ్రమ అధికారులు, భవిష్యత్తులో ఈ తరహా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో హామిల్టన్ సీఎస్సార్ చర్యలను అభినందించారు. దివ్యాంగులకు లబ్ధి చేకూర్చే ఈ కార్యక్రమం ప్రశంసనీయం అన్నారు. శ్రీసిటీ మరియు స్థానిక కంపెనీల భాగస్వామ్యంతో మరింత విస్తృతంగా సీఎస్సార్ కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. శ్రీసిటీ ఫౌండేషన్ మరియు వసంతం ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ద్వారా తొండూరు, శ్రీహరికోట కాలనీ, మల్లవారిపాలెం వెస్ట్, చిగురుపాలెం, సత్యవేడుతో సహా శ్రీసిటీ పరిసర గ్రామాలలోని లబ్ధిదారులను గుర్తించారు.