TEJA NEWS TV:
వర్షాలు లేక పంటలు ఎండుతున్నాయి
దిగుబడులు లేక రైతులకు నష్టాలు
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ మాదిగ డిమాండ్
(తేజ న్యూస్ టీవీ , హొళగుంద,
Ns.అరుణ్ కుమార్ )
కర్నూలు జిల్లాలో వ్యవసాయ ఆధారిత ప్రాంతం అయిన హొళగుంద మండలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోయి, పంటలు చేతికి రాక పెట్టిన పెట్టుబడులు నష్టపోయి మండల రైతులు కరువుకోరల్లో చిక్కుకున్నారని హొళగుంద మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మండలంలో రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ, రైతుల పరిస్థితిపై పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ వేలాది రూపాయలు వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయానికి పెట్టుబడిగా పెట్టి పంటలు సాగు చేసిన రైతులు పంట దిగుబడులు రాకపోవడంతో నష్టాల పాలయ్యి తెచ్చిన అప్పులు నెత్తిన మోసుకొన్నారు
అని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో రైతులు ప్రధానంగా సాగుచేసిన పత్తి, మిరప, వేరుశనగ పంటలు వర్షాభావంతో రైతులను దారుణంగా నష్టపరిచాయని పేర్కొన్నారు.
ఈ సీజన్ లో పత్తి పంటను సాగు చేసిన రైతులు వర్షాలు లేక ప్రతి మొక్కలు ఎండిపోయి నష్టపోయారని వివరించారు.
మిరపను వర్షాధారంతో మెట్ట పంటగా సాగు చేసిన రైతులు సరైన వర్షాలు లేక దిగుబడి రాక వేలాది రూపాయలు నష్టపోయారని అన్నారు. అదేవిధంగా వేరుశనగ పంటను సాగుచేసిన రైతులు వర్షాలు లేక భూమిలో తేమ లేక వేరుశనగ కాయలు కాయ లేదని దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. వేలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి పంట దిగుబడులు రాక నష్టపోయిన రైతులు ఎరువులు పురుగుమందులకు అప్పులు కట్టలేని పరిస్థితులలో ఉన్నారని దీనిపై దృష్టి సారించి సంబంధిత రెవెన్యూ వ్యవసాయ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు జరిగిన పంట నష్టం యొక్క వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి తెలియచేయాలని కోరారు. మండలంలో ఉన్నటువంటి కరువు పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేసి హొళగుంద మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేలా సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా ఉన్నతాధికారులు వ్యవసాయ ఆధారిత మండలంలో రైతుకు జరిగిన నష్టాన్ని గుర్తించి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని లేనిపక్షంలో నష్టపోయిన రైతులతో కలిసి పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలను, ప్రజాప్రతినిధుల ఇండ్లను ముట్టడించి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతులు,ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

