భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం, జనవరి 6:
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో స్థానిక రాంనగర్‌లోని ఎస్‌ఆర్ డీజీ పాఠశాలలో సడక్ సంరక్షణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్‌టీఓ భూషిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం చేసే చిన్న తప్పు మనకే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుందని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీట్‌బెల్ట్ ధరించకపోవడం, హెల్మెట్ వాడకపోవడం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలుగుతుందని, ఇలాంటి కార్యక్రమాలు ప్రశంసనీయం అని అన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం సుమారు 1.75 లక్షల మంది మరణిస్తున్నారని, దీని కారణంగా అనేక కుటుంబాలు దుఃఖంలో మునిగిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు సందేశం పంపాలని సూచించారు.
సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, విద్యార్థులు తమ పుట్టినరోజు లేదా ఇతర సంతోషకర సందర్భాల్లో తల్లిదండ్రులకు హెల్మెట్‌ను బహుమతిగా ఇవ్వడం కుటుంబ భద్రతకు ఉపయోగపడుతుందని సూచించారు.
ఎస్‌ఆర్ కొత్తగూడెం జోనల్ ఇన్‌చార్జ్ సతీష్ మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ముందుండి భావితరాలకు మంచి సందేశం అందిస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఎంవీఐలు వెంకటరమణ, మనోహర్, ఏఎంవీఐలు ప్రకాష్, అశోక్, శ్వేత, మానస, ఎస్‌ఆర్ డీజీ పాఠశాల ప్రిన్సిపల్ తిరుమల్ రెడ్డి, ఉపాధ్యాయులు, డ్రైవర్లు, హెల్పర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత : ఆర్‌టీఓ భూషిత్ రెడ్డి
RELATED ARTICLES



