

రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ
మొక్కలను విరివిగా నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వృక్ష యజ్ఞం సొసైటీ వ్యవస్థాపకురాలు లావణ్య పిలుపునిచ్చారు. చాగలమరి మండలం మద్దూరు గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు తులసి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా 200 మందికి పైగా భక్తులకు ఆమె ఉచితంగా తమ సంస్థ ద్వారా మొక్కలను పంపిణీ చేశారు. తమ సంస్థ ద్వారా విరివిగా మొక్కలు నాటడం, మొక్కల పంపిణీ కార్యక్రమాలను ఒక ఉద్యమంలా చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చునని తెలిపారు. పుట్టినరోజులు, ఫంక్షన్ల పేరిట ధనం వృధా చేయకుండా సమాజానికి ఉపయోగపడే మొక్కలు నాటి సంరక్షించడం ఎంతో మేలని తెలిపారు. పాఠశాల విద్యార్థిని డిలీనా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వృక్షయజ్ఞం సభ్యులు లక్ష్మీ ప్రసన్న, జాహ్నవి, సుభాషిని తదితరులు పాల్గొన్నారు.



