తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలంలో ఆరు పంచాయతీలకు కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం. పరంధాం తీవ్ర అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు వెల్లడి అయ్యాయి.
బీరకుప్పం, ఎస్.ఎస్. పురం, వెల్లూరు, వెంబాకం, కొట్టకడు, చిన్నపట్టు గ్రామాల్లో జరిగిన 15వ వార్షిక గ్రామ సభల నిధులు, ఇంటి పన్నుల వసూళ్లు, చెరువుల వేలం ద్వారా వచ్చిన నగదును సర్పంచులకు తెలియకుండా ఎం. పరంధాం తన చేతివాటం ద్వారా దారి మళ్లించినట్టు సమాచారం.
ఈ విషయంలో దాదాపు 15 నుండి 20 లక్షల రూపాయల వరకు మాయం చేసినట్లు ఆధారాలతో కూడిన నివేదిక జిల్లా కలెక్టర్‌కు అందజేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, కొందరు గ్రామ సర్పంచులను బెదిరిస్తూ చేసిన ఆడియో సంభాషణలు వెలుగులోకి వచ్చాయి.
ఈ వ్యవహారంలో పరంధాం మాత్రమే కాకుండా, కొంతమంది ఉన్నతాధికారులు కూడా భాగస్వాములుగా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిపై త్వరలోనే పూర్తి ఆడియో బయటపెడతామని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
అవినీతి ఆరోపణలతో పంచాయతీ వ్యవస్థపై ప్రజల్లో ఆందోళన మొదలైంది.


 
                                    


