*నేడు ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం వేలం పాటలు*
-దేవాదాయ శాఖ కమీషనర్ వద్ద కళ్యాణ మండపం అంశం
-సప్లయర్స్, డెకరేషన్ వేలం పాటలపై సర్వత్రా ఉత్కంఠ
-వేలం పాటలకు ఏర్పాట్లు పూర్తి – ఈఓ నంద్యాల
పట్టణంలోని ప్రథమనందీశ్వరస్వామి దేవస్థానం వేలం పాటలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. దేవస్థానం కళ్యాణ మండపంతో పాటు సప్లయర్స్, డెకరేషన్లపై వేలం పాటలు నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. దేవస్థానం కళ్యాణ మండపంపై పరోక్షంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ ప్రచ్ఛన్న యుద్ధమే నడుస్తోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత 15 సంవత్సరాలుగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిల్పా సేవా సమితి పర్యవేక్షణలో నిర్వహిస్తూ వచ్చారు. రాష్ట్రంలో అధికార మార్పిడి తరువాత శిల్పా సేవా సమితి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న కళ్యాణ మండపంపై దేవాదాయ శాఖకు, నిర్వాహకులకు మధ్య కోర్టు వ్యవహారంలో వాదిగా ఉన్న వ్యక్తి కేసును ఉపసంహరించుకున్నట్లు
తెలుస్తోంది. సదరు వ్యక్తి సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరినట్లు ప్రతిపక్ష పార్టీ వైసీపీ చెబుతోంది. కోర్టు కేసును ఉపసంహరించుకున్న తరువాత కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఇదే సమయంలో కోర్టులో కేసులు వేసుకోవడం, వాటిపై తీర్పులు రావడం చకచకా జరిగిపోతూ వచ్చింది. చివరిగా దేవాదాయ శాఖ కొద్ది రోజుల క్రితం కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకున్న విషయం పాఠకులకు విధితమే. ఇదే సమయంలో నిర్వాహకులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు దేవాదాయ శాఖ కమీషనర్ వద్ద కూర్చోని దేవాదాయ శాఖకు చెల్లించే నగదుపై మాట్లాడుకోవాలని సూచించింది. ఈ నెల 4వ తేదీన కళ్యాణ మండపంతో పాటు సప్లయర్స్, డెకరేషన్స్ వేలం పాటలు నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో కోర్టు తీర్పుపై కళ్యాణ మండపం అంశాన్ని పక్కన పెట్టి సప్లయర్స్, డెకరేషన్లపై వేలం పాటలు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లును చేసింది. గత కొన్నేళ్లుగా కళ్యాణ మండపాన్ని నిర్వహించే నిర్వాహకుల కనుసన్నల్లోనే డెకరేషన్, సప్లయర్స్ అంశాలు ఉన్నట్లుగా అధికార పార్టీ ఆరోపిస్తోంది. సుమారు 15 ఏళ్ళ నుంచి కళ్యాణ మండపంతో ముడివడిన
అంశాల నుంచి దేవాదాయ శాఖకు ఏలాంటి ఆదాయం సమకూరలేదని అధికార పార్టీ ప్రస్తావిస్తూ వస్తోంది. తాజాగా సప్లయర్స్, డెకరేషన్ల వేలం పాటలపై మంచి స్పందన ఉన్నట్లు ఈవో విఎల్ఎన్ రామానుజన్ చెబుతున్నారు. ఇప్పటికే 30కి పైగా దరఖాస్తులు తీసుకొని వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదే సమయంలో వైఎస్ఆర్ కళ్యాణ మండపం పేరుమీద కొనసాగుతున్న కళ్యాణ మండపాన్ని శ్రీ ప్రథమనందీశ్వర స్వామి దేవస్థాన కళ్యాణ మండపంగా దేవాదాయ శాఖ పేరు మార్చింది. నిర్మాణ దాత శిల్పా మోహన్ రెడ్డి పేరును
అలాగే ఉంచనున్నారు. వేలం పాటలకు సంబంధించిన ఏర్పాట్లును పూర్తి చేసినటు ఈవో రామానుజన్ తెలిపారు. మొతం మీద గురువారం జరగనున్న వేలం పాటలపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వేలం పాటల్లో దేవాదాయ శాఖకు ఏ మేరకు ఆదాయం సమకూరుతుందో వేచి చూడాలి.