భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
08-02-2025 దుమ్ముగూడెం మండలం
దుమ్ముగూడెం మండలంలోని పైడిగూడెం పంచాయతీలో ఈ రోజు జనరల్ బాడీ సమావేశం నిర్వహించబడింది. సమావేశానికి పైడి ప్రసాద్ అధ్యక్షత వహించగా, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని మండిపడ్డారు. రైతులకు పంట రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, గృహ హీనులకు ఇళ్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం, కౌలు రైతులకు ప్రోత్సాహక భృతి, అన్నదాతలకు మద్దతు ధర వంటి పథకాలను అమలు చేస్తానని చెప్పిన సీఎం, ఏడాది గడిచినప్పటికీ వాటిని కార్యరూపం దాల్చలేదని విమర్శించారు.
ఆరు గ్యారంటీలు అమలు కావాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20న “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఆందోళనలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ హక్కుల కోసం పోరాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ (ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం) జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్, పీడబ్ల్యూ మహిళా సంఘం నాయకురాలు సమ్మక్క, సూర్యకాంతం, నాగమణి, అరుణోదయ నాయకులు కొండలరావు, పైడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
– సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ
దుమ్ముగూడెం మండలంలోని పైడిగూడెం పంచాయతీలో జనరల్ బాడీ సమావేశం
RELATED ARTICLES