
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజా న్యూస్ టీవీ
సుజాతనగర్, నవంబర్ 21:
పత్తి కొనుగోలు కేంద్రాల్లో 12 శాతం తేమ పేరుతో రైతులను వేధించడం ఆందోళనకరమని, ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధనను ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం సుజాతనగర్, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు మండల కమిటీల ఆధ్వర్యంలో సిపిఎం బృందం డేగలమడుగు మంజీత్ కాటన్ మిల్లులోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించింది.
ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నాయకత్వం తెలుసుకుంది. కొనుగోలు కేంద్రాల్లో 12% తేమ పేరుతో పత్తిని వెనక్కి పంపుతున్నారని, ఒక్క ఎకరాకు ఏడు క్వింటాళ్లకే పరిమితం చేస్తున్నారని, క్వింటాకు కేవలం ₹7,800 మాత్రమే ఇస్తున్నారని రైతులు తెలిపారు. తుపాను కారణంగా పత్తి తడిసినప్పటికీ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పి, ఇప్పుడు తేమ శాతం పేరిట తిరస్కరించడం అన్యాయం అని మచ్చా వెంకటేశ్వర్లు విమర్శించారు.
దళారుల ఆధిపత్యంతో కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని, వ్యవసాయ శాఖ నేరుగా రైతుల నుండి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. తేమ శాతాన్ని 12 నుంచి 20 శాతం వరకు పెంచాలి, ఎకరాకు కనీసం 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలి, క్వింటాకు ₹10,000 అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారులు, దళారులు తక్కువ ధరలకు పత్తి కొనుగోలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారని, పత్తికి గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు యాసా నరేష్, మండల కార్యదర్శులు పెద్దిన్ని వేణు, జంగిలి వెంకటరత్నం, కాట్రాల తిరుపతిరావు, గండమాల భాస్కర్, నల్లగొపు పుల్లయ్య, కొండె కృష్ణ, బాలు వెంకటేశ్వర్లు, చింతల శ్రీనివాసరావు, చల్లా ఏడుకొండలు, చల్లపల్లి రాజా తదితరులు పాల్గొన్నారు.



