Friday, April 4, 2025

చండ్రుగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
02-04-2025



తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచితంగా ఫోర్టిఫైడ్ సన్నబియ్యం పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో, చండ్రుగొండ మండలంలో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రముఖ మహనీయుల విగ్రహాలకు పూలమాలలు అర్పించిన అనంతరం, చండ్రుగొండ మరియు తిప్పనపల్లి గ్రామాల్లోని రేషన్ దుకాణాలలో తెల్ల రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 17,263 రేషన్ దుకాణాల ద్వారా దాదాపు 2,91,000 కుటుంబాలకు ఉచితంగా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నేతృత్వంలో గత నెల 31న హుజూర్నగర్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.

రైతులకు గిట్టుబాటు ధర – అదనంగా బోనస్

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో సన్నరకం వరిధాన్యాన్ని గిట్టుబాటు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఎమ్మెల్యే వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యం ద్వారా ఉత్పత్తి చేసిన బియ్యాన్ని ప్రతి లబ్ధిదారుడికి 6 కేజీల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ప్రతి అర్హుడూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాజీవ్ యువ వికాసం పథకం గడువు పొడిగింపు

నిరుద్యోగ యువతీ యువకుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టి రూ. 6,000 కోట్ల కేటాయింపుతో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించిందని ఎమ్మెల్యే ప్రకటించారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడుతుండగా, గడువు ఏప్రిల్ 5తో ముగియనుండగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించిందని ఆయన తెలిపారు. అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులు యువతకు అవగాహన కల్పించి దరఖాస్తు చేసుకునేలా చేయాలని కోరారు.

ఇందిరమ్మ ఇళ్లకు రెండో విడత శంకుస్థాపన

మండల పరిధిలోని బెండలపాడు గ్రామం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో రెండవ విడతలో నిర్మించబోయే ఇండ్లకు భూమి పూజ నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం, మండల వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 26 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ కె. ప్రసన్న, ఎంపీడీవో అశోక్ ,ఆర్‌ఐ షేక్ అక్బర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు బొజ్జ నాయక్, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, గోవిందరెడ్డి, మహిళా నాయకురాలు బడుగు కృష్ణవేణి, సారెపల్లి శేఖర్, పున్నెబోయిన బిక్షమయ్య, కడియాల పుల్లయ్య, చాపలమడి ప్రసాద్, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular