

TEJA NEWS TV :
భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు, 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు ప్రకారం ఆగస్టు 13, 14, 15 తేదీలలో హర్ ఘర్ తిరంగా – ప్రతి ఇంటా జాతీయ జెండా కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమం భాగంగా, నేడు ఆళ్లగడ్డలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (APUSMA) ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు శ్రీ టి. అమీర్ బాషా ఆధ్వర్యంలో, ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ డి.ఎస్.పి. శ్రీ కె. ప్రమోద్ గారు, ఆళ్లగడ్డ టౌన్ సి.ఐ. శ్రీ ఎం. యుగంధర్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్లలోని కెపిజి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని, ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో జాతీయ జెండా రూపకర్త తెలుగు తేజం పింగళి వెంకయ్య గారికి పూలమాల అర్పించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ మానవహారం రూపంలో, జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.
ముఖ్య అతిథి డి.ఎస్.పి. శ్రీ కె. ప్రమోద్ గారు మాట్లాడుతూ, “ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని ప్రదర్శిద్దాం. కులం, మతం, ప్రాంతం, లింగం అన్న తేడాలకతీతంగా, మనందరినీ ఏకం చేసేది ఒకే జాతీయ జెండా. ఈ జెండాను రూపకర్త పింగళి వెంకయ్య గారిని స్మరించుకొని గర్వపడాలి. జాతీయ జెండా మన ఐక్యత, దేశభక్తి, సార్వభౌమాధికారానికి ప్రతీక” అన్నారు.
ఈ సందర్భంగా APUSMA అధ్యక్షులు శ్రీ టి. అమీర్ బాషా మాట్లాడుతూ, “మన తెలుగు కీర్తి తేజం పింగళి వెంకయ్య గారు రూపొందించిన త్రివర్ణ పతాకం స్వాతంత్ర్య పోరాటంలో భారతీయులను ఏకం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఇంటింటా జాతీయ జెండాను ఎగురవేయాలి” అని కోరారు.