శ్రీసిటీ, మే 18 (తేజ న్యూస్ టీవీ )
శ్రీసిటీ ఆధ్యాత్మిక, సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శనివారం స్థానిక బిజినెస్ సెంటర్ లో నిర్వహించిన ‘సీతారాముల కళ్యాణం’ ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ఉపన్యాసకులుగా విచ్చేసిన శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రధాన ఆచార్యులు, ప్రముఖ ఆధ్యాత్మిక సాహితీవేత్త కందాడై సెల్వన్ గారు సీతారాముల కళ్యాణం ప్రాముఖ్యత, ప్రాశస్త్యం, గొప్పదనం గురించి చాలా చక్కగా వివరించారు.త్రేతా యుగం నుండి యుగ యుగాలుగా అజరామరంగా కీర్తింపబడుతున్న సీతారామ కల్యాణ ఘట్టాన్ని, ఇతర పౌరాణిక వివాహ సన్నివేశాలతో పోల్చి సెల్వన్ గారు తమ ప్రసంగాన్ని ఎంతో రక్తి కట్టించారు. రామాయణంలో వాల్మీకి వివరించిన విధంగా సీతారామ కళ్యాణం యొక్క సాంప్రదాయాన్ని, ప్రత్యేకతలను, సీతారాముల విశిష్ఠ వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని, ఇతర వివిధ పాత్రల ఔచిత్యాన్ని, శ్రీమద్ రామాయణ ప్రాముఖ్యతను సామాజికపరంగా చక్కగా వివరించారు. త్యాగరాజు, అన్నమయ్య, పోతన, కంబన్ వంటి కవులు సీతారామ కల్యాణ ఘట్టాన్ని తమదైన శైలిలో మనోహరంగా ఎలా వర్ణించారో సోదాహరణగా చెప్పారు. సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ప్రస్తుత సామాజిక పరిస్థితులతో అన్వయిస్తూ, మారుతున్న పరిస్థితులు, విపరీత పోకడలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మన ఇళ్లల్లో నిర్వహించే ప్రతి కళ్యాణం ఇకపై ఒక సీతారామ కళ్యాణం కావాలని, త్వరలో ఆ రోజులు మళ్ళీ వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీసిటీ ఉద్యోగులు, పరిసర గ్రామాలకు చెందిన పలువురు ఆధ్యాత్మిక సాహిత్య ప్రియులు పాల్గొన్నారు. శ్రీసిటీ పీఆర్వో పల్లేటి బాలాజీ కార్యక్రమ ప్రయోక్తగా వ్యవహరించారు.
శ్రీసిటీలో అలరించిన సీతారాముల కళ్యాణం ఆధ్యాత్మిక ఉపన్యాసం
RELATED ARTICLES