ఈఏడాది రెండుసార్లు గోదావరి వరదలు ఉదృతంగా వచ్చినా ఒక్క చుక్క వరద నీరు కూడా భద్రాచలం
పట్టణంలోకి రాకుండా కట్టుదిట్టం చేశామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం భద్రాచలంలో పర్యటించిన ఆయన గోదావరి వరదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీతమ్మ నడయాడిన రాముడు కొలువై ఉన్న దేవస్థానంతో పాటు దేవస్థానం భూములను సర్వే చేసి ప్రతిపాదనలు పూర్తిచేసి పది కాలాలపాటు ఉపయోగపడేలా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి వచ్చే భక్తులకు దుర్గంధం వెదజల్లకుండా దేవస్థానం పరిసరాలతో పాటు భద్రాచలం వీధులలో చెత్త ఎక్కడబడితే అక్కడ వేయకుండా గ్రామపంచాయతీ సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు, ఎప్పటికప్పుడు చెత్తను ఏరివేసి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా డంపింగ్ యార్డ్లలో వేయాలని, డంపింగ్ యార్డ్ నిర్మాణం త్వరగా పూర్తిచేసి శానిటేషన్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామపంచాయతీ ఈవోకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో కూడా సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని అన్నారు.
భద్రాచలాన్ని రాబోయే రోజులలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కీర్తి ప్రతిష్టలు వచ్చేలా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. గోదావరి వరదలు రాకముందే మే, జూన్ నెలల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా స్లూయిస్ పాయింట్ దగ్గర శాశ్వత
నిర్మాణం చేపట్టి భద్రాచలం పట్టణంలో నీరు నిలువ లేకుండా నిలువరించాలని భద్రాచలం పట్టణం నుండి గుండాల, వాజేడు వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు సౌకర్యాలు కల్పించి ఎక్కడా వరదల వలన ఇబ్బందులు లేకుండా రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని, గోదావరికి వచ్చే భక్తులకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్లీవ్స్ పాయింట్ నుంచి ఏర్పాటు చేసిన పైపులు కింది నుంచి వేసి శాశ్వతంగా అమర్చాలని అధికారులను ఆదేశించారు. పవిత్ర పుణ్య క్షేత్రం భద్రాచలాన్ని అందంగా, ఆరోగ్యంగా భక్తులందరూ కొనియాడేలా కంటికి రెప్పలా కాపాడుతున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారుల పనితీరును కొనియాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదల వలన జరిగిన నష్టాన్ని అన్ని విధాలా రాష్ట్ర
ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో
గోదావరి వరదల కారణంగా పరీవాహక ప్రాంతంలో ఆస్తినష్టం, ప్రాణ నష్టం భారీగా వాటిల్లిందని, కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాలికలు రూపొందించి ఎక్కడా ఎటువంటి నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టారనివారన్నారు. గోదావరి వరద ఉదృతిని అధికారులు, స్థానిక ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.
భద్రాచలం పట్టణంలోకి చుక్కనీరు రాకుండా కట్టుదిట్టం చేశాం
-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
RELATED ARTICLES