
TEJA NEWS TV
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని రైతులు ప్రైవేటు పొగాకు కంపెనీల మాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు హెచ్చరించారు. మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ
ప్రైవేట్ పొగాకు కంపెనీలు ధన దాహంతో అగ్రిమెంట్ పేరుతో క్వింటాలకు 15 వేల రూపాయలు నుండి 18 వేల రూపాయల వరకు చెల్లించి తామే రైతుల పండించిన మొత్తం పొగాకును కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి ఉల్లంఘించడం వల్ల,గత సంవత్సరం ఖరీఫ్ లో పొగాకు నాటిన రైతులందరూ తీవ్రంగా నష్టపోయారన్నారు . నేటికీ రైతులు పండించిన మొత్తం పొగాకు అమ్ముడుపోక, రేట్లు 18 వేల నుండి 2,500 రూపాయలకు పడిపోవడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేపట్టకపోవడంతో ఇష్టానిస్సారంగా ప్రైవేటు కంపెనీలు రైతాంగాన్ని దోపిడీ చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ 2025 ఖరీఫ్ సీజన్లో పొగాకునాటించడం కోసం నారుమల్లు తయారుచేసి, కొన్ని కంపెనీల బ్రోకర్లు గ్రామాల్లో మళ్ళీ రైతుల వద్దకు పొగాకు నాటమని తిరుగుతున్నారు. కావున వారి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నారు అమ్ముకొని సంపాదించడం కోసం మాయ మాటలు చెప్పి, మేమే పొగాకు కొనుగోలు చేస్తాంఅని ఐడీలు క్రియేట్ చేసి, పంట వచ్చిన తర్వాత మేము ఇన్నిఎకరాలు నాటుకోమని చెప్పలేదు అని బుకాయిస్తున్నారు. కొనుగోలు సమయానికి అందుబాటులో లేకుండా పారిపోయే కేటుగాళ్లు జిల్లాలో వివిధ రకాల కంపెనీల పేర్లు చెప్పుకొని రైతుల వద్దకు తిరుగుతున్నారు. వీరి పట్ల రైతాంగం అప్రమత్తంగా ఉండాలని, మీ వద్దకు వచ్చి అన్ని కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వ అధికారుల సమక్షంలో వ్రాత పూర్వకమైన అగ్రిమెంటు కచ్చితంగా చేసుకోవాలని, అగ్రిమెంటులో కంపెనీ యాజమాన్యం వారి సంతకాలు, అడ్రస్సు, రేటు, క్వాలిటీ, కొనుగోలు సమయం లాంటి వివరాలు పొందుపరిచేలా చూసుకోవాలని ఇలాంటివన్నీ కచ్చితంగా వ్రాతపూర్వకంగా రాసిస్తే రైతులు మోసపోకుండా ఉండే అవకాశం ఉంది. కావున జిల్లాలోని రైతులందరూ మీ వద్దకు వచ్చి అన్ని రకాల ప్రైవేట్ కంపెనీల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సంబంధిత మండలాల వ్యవసాయ అధికారుల సూచనలు కూడా తీసుకోవాలని రైతులను కోరారు.



