ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం
జిల్లాలో డయేరియా కేసులు విజృంభిస్తుండటంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ అప్రమత్తంగా ఉండాలని నందిగామ ఎమ్మల్యే తంగిరాల సౌమ్య ఆదేశించారు. వార్డుల వారీగా ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్‌లు ఇంటింటి సర్వే చేసి పరిస్థితిని పరిశీలించాలన్నారు. తాగునీటి వనరులను బ్లీచింగ్ చేయటంతో పాటు గ్రామాల్లో పారిశుధ్య పనులను నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం ద్వారా డయేరియాను సమర్థవంతంగా అడ్డుకోవచ్చన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల శుభ్రతపై ప్రజలకు, చిన్నారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రం చేయించడం, తాగునీటి పరీక్షలు చేయించడం ద్వారా తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎంపీ డీవోలు, మున్సిపల్ కమిషనర్లు పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్నారు. వర్షపు నీరు నిలవకుండా చూడాలని, డ్రెయినేజీ వ్యవస్థలు మెరుగుపరచాలని ఆదేశించారు. కలుషిత ఆహారం ముప్పు పైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఎక్కడైనా డయేరియా కేసులు నమోదైతే వారికి సరైన వైద్యం అందించాలని ఆదేశించారు.