TEJA NEWS TV :
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కార్యకర్తలు, సహాయకుల పై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని వెంటనే కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని హెల్పర్స్ అసోసియేషన్ ( ఏఐటీయూసీ ) రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ, మండల నాయకులు వహీదా, సుజాత ఇందుమతి, సిఐటియు యూనియన్ సభ్యులు శ్రీదేవి లు హెచ్చరించారు. సమ్మెలో భాగంగా నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో సోమవారం అంబేద్కర్ సర్కిల్ నుంచి పురవీధులలో శాంతియుతంగా ర్యాలీగా వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లోని ఎస్ ఐ రమణయ్య కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ న్యాయపరమైన డిమాండ్స్ పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఆందోళన కొనసాగిస్తున్నామన్నారు. అంగన్వాడీల నిర్వహణకు సచివాలయ ఉద్యోగులను నియమించడం పట్ల అంగన్వాడి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతన చట్టం ప్రకారం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే అదనంగా వేయి రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్ సౌకర్యంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని వారు కోరారు.ఒకవైపు ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. మరోవైపు అంగన్వాడీల పరిస్థితి డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తున్నామన్నారు. నిర్బంధాలతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూడడం అత్యంత దారుణమని పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఏమిటని వారు ప్రశ్నించారు. చాలీచాలని గౌరవ వేతనంతో బ్రతుకు జీవనం సాగిస్తున్న మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పలు ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదన్నారు. ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడి కార్యకర్తలు అంగన్వాడి సహాయకులు, చాగలమర్రి టౌన్ లోని అంగన్వాడి కార్యకర్తలు సహాయకులు పాల్గొన్నారు.