


ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామంలో బుధవారం రాత్రి
రూరల్ సిఐ హనుమంత నాయక్, రూరల్ ఎస్.ఐ నరసింహులు, పోలీస్ సిబ్బంది పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. బాచేపల్లి గ్రామాన్ని సమస్యాత్మక గ్రామంగా గుర్తించడంతో రానున్న ఎన్నికల సందర్భంగా రూరల్ సీఐ హనుమంత నాయక్ ప్రత్యేక దృష్టిని సారించారు.ఈ సందర్భంగా గ్రామంలో పోలీసు అధికారులు గ్రామ సభను ఏర్పాటు చేసి ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. రూరల్ సీఐ హనుమంత నాయక్ మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలలో రానున్న ఎన్నికల సందర్భంగా ప్రత్యేక పోలీసు నిఘా ఉంటుందన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు పోలీస్ శాఖతో సహకరించాలని సీఐ హనుమంత నాయక్ విజ్ఞప్తి చేశారు. గతంలో జరిగిన ఎన్నికల పోలింగ్ రోజున బాచేపల్లి గ్రామంలో గొడవలు చోటు చేసుకోవడంతో ముందు జాగ్రత్త చర్యగా తమ శాఖ తరపున ప్రజలకు ముఖ్యమైన సూచనలు ఇవ్వడం జరుగుతున్నదని సి.ఐ తెలిపారు. ఎన్నికల సమయంలో గొడవలు సృష్టిస్తే వారిపై చట్టరీత్యా బైండోవర్ కేసులతో పాటు కఠిన చర్యలు ఉంటాయని సిఐ హనుమంతనాయక్ హెచ్చరించారు.