Monday, January 20, 2025

ఆలూరు :పల్లె పండుగలో అయినా వారి ఆశ తీరేనా… ఆ గ్రామాలకు రోడ్డు వచ్చేనా…?

స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా …

ఆ ఊర్లకు రోడ్డు వేయలేదు

రోడ్డు సరిగా లేక విద్య… వైద్యం…  రవాణా అంతంత మాత్రమే

పి ఎం జి ఎస్ వై  పథకం కింద రోడ్డు వేయాలని  గ్రామస్తుల వినతి

పట్టించుకోని అధికారులు…  నాయకులు



నాగరకన్వి… హొన్నూరు… హొన్నూరుకొట్టాల గ్రామస్తుల ఎదురుచూపు

(తేజ న్యూస్, హొళగుంద,NS అరుణ్ కుమార్ )

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  పల్లె పండుగ కార్యక్రమంతో  గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ  పట్టనుంది. అయితే ఆ మహర్దశ తమ గ్రామాలకు ఎప్పుడు పడుతుంది అని మండలంలోని నాగరకన్వి… హొన్నూరు… హొన్నూరు కొట్టాల ప్రజలు  ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా… తాతలు…  తండ్రుల కాలం గడచిపోయినా ఎవరు కూడా ఈ గ్రామాలకు ఎర్ర బస్సు వచ్చింది చూడలేదని… అసలు రోడ్డే లేకపోతే  ఎర్ర బస్సుపై ఆశలు ఇంకెక్కడివని  ఆ గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. హొళగుంద మండలంలో మారుమూల గ్రామీణ ప్రాంతం అయినా నాగరకన్వి గ్రామం మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో… హొన్నూరు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో… హొన్నూరు కొట్టాల గ్రామం  ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గ్రామాలకు  పేరుకే రోడ్డు ఉన్నప్పటికీ…  ఆ రోడ్డుపై ప్రయాణం చేయడం ఎంతో కష్టమని ఆయా గ్రామాల ప్రజలు  పేర్కొంటున్నారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో గ్రామంలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చిన… పాములాంటి విష పురుగులు కొరికిన…  గర్భిణీ స్త్రీలకు… చిన్నపిల్లలకు  అత్యవసరం అయినా  వారు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని…  అలాగే రోడ్డు లేక…  రవాణా వ్యవస్థ లేక గ్రామంలో ఉన్న పాఠశాలలో 5వ తరగతి వరకు చదివిన విద్యార్థులు …  కిలోమీటర్ల కొద్ది దూరం నడిచి పోలేక… ప్రత్యేకించి ఆడపిల్లలకు రక్షణ కరువైన ఈ కాలంలో  విద్యార్థులు తమ చదువును అర్ధంతరంగానే ఆపేస్తున్నారు…  అదేవిధంగా రైతులు రోడ్డు లేక మోకాలులోకి గుంతల్లో …  మట్టిరోడ్లో తమ పంటలను బయటి మార్కెట్ కు   తరలించడానికి నానా అవస్థలు పడుతుండగా … మార్కెట్… ఇతర అవసరాల కోసం  ఆయా గ్రామాల నుంచి బస్సుల కోసం రోడ్డుకు నడిచి రావాల్సిన పరిస్థితులు  ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా అవస్థలు పడుతూనే  ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూనే  ఉన్న ఈ గ్రామాల ప్రజలు తమ గ్రామానికి రోడ్డు వేయమని  గ్రామ సభల్లో.. స్పందన కార్యక్రమంలో ఇచ్చిన వినతులు బుట్ట దాఖలు అయ్యాయే ఉన్న రోడ్డు కనీసం మరమ్మత్తులకు కూడా నోచుకోలేదు. ప్రధానమంత్రి  గ్రామీణ సడక్ యోజన స్కీమ్  కింద  గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్డుకు అనుసంధానించేలా  రోడ్లు వేస్తుంటే మారుమూల గ్రామీణ ప్రాంతమైన ఈ గ్రామాలకు అధికారులు…  ప్రజా ప్రతినిధులు రోడ్డు వెయ్యాలన్న  ఆలోచన చేయకపోవడం శోచనీయం. ప్రస్తుతం పల్లె పండుగ పేరుతో పల్లెల్లో ప్రజల అవసరాలు తీర్చేలా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పై ఈ గ్రామాల ప్రజలు ఎంతో ఆశను పెట్టుకున్నారు. పల్లెల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో  అయినా తమ గ్రామానికి రోడ్డు రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. వారి ఆశలు నిజం చేస్తూ పల్లె పండుగ కార్యక్రమంలో హొళగుంద నుండి హాన్నూరు కొట్టాల వరకు తక్కలకోట రోడ్డుకు అధికారుల భూమి పూజ చేయడంతో ఎంతో సంబరపడ్డారు. అయితే వారు సంబరపడిన మురుసటిరోజే ఆ రోడ్డును  జిల్లా ఉన్నతాధికారులు రద్దు చేశారని సమాచారం అందడంతో  గ్రామస్తులు హతాసులయ్యారు. తమ గ్రామం పై  అధికారులకు ఎందుకు అంత చిన్న చూపు అని  ప్రశ్నిస్తూ ఈసారి రోడ్డు వేయకపోతే రోడ్ ఎక్కుతామని అంటున్నారు. మరి భూమి పూజ చేసిన రోడ్డును అధికారులు రద్దు చేస్తారా  వేస్తారా వేచి చూడాలి మరి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular