TEJA NEWS TV : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలోని శ్రీ లక్ష్మీ వనంలో సోమవారం వనభోజన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకొని లక్ష్మీ వనంలోని ఉసిరిక వృక్షం కింద కొలువు తీర్చి విశేష తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు భూమా జగద్విఖ్యాత్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులతోపాటు ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, పలువురు వైసీపీ నాయకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు కీడంబి వేణుగోపాల్ స్వామి మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద ఇలా వనభోజనం చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులకు అన్ని కోరికలు నెరవేరుతాయని వివరించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ ఎస్సై హరిప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అహోబిలం లక్ష్మీ వనంలో ఘనంగా వనభోజన మహోత్సవం
RELATED ARTICLES